Madhya Pradesh: తనను బందిపోటు దొంగన్న హెడ్మాస్టర్‌ను క్షమించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
- సీఎంను బందిపోటు దొంగగా అభివర్ణించిన హెడ్మాస్టర్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తానన్న సీఎం
తనను బందిపోటు దొంగ (డాకు) అన్న ప్రధానోపాధ్యాయుడిని క్షమించినట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు తాను ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తానన్న సీఎం ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం హెడ్మాస్టర్‌పై చర్యలు సబబే అయినా, వ్యక్తిగతంగా ఆయనను క్షమించి వదిలేస్తున్నట్టు చెప్పారు. అయితే, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని తాను అలా అనడం కరెక్టేనా? అన్న విషయాన్ని ఆయనే ఆలోచించుకోవాలన్నారు.
జబల్‌పూర్‌లోని ప్రభుత్వ కనిష్ఠ బునియాది మాధ్యమిక పాఠశాల హెడ్మాస్టర్ ముకేశ్ తివారీ.. సీఎంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయనను బందిపోటు దొంగ (డాకు)గా అభివర్ణించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జిల్లా కలెక్టర్ చావి భరద్వాజ్ ఆయనను సస్పెండ్ చేశారు. తాజాగా, ఈ వీడియోపై స్పందించిన కమల్‌నాథ్ ఆయనను క్షమించి, సస్పెన్షన్ ఎత్తివేసినట్టు తెలిపారు.