Madhya Pradesh: 'దృశ్యం' సినిమా స్ఫూర్తి: యువతిని చంపి, కుక్కను పాతిపెట్టి.. పోలీసులను తప్పుదోవ పట్టించిన తండ్రీ కొడుకులు!
- ఇండోర్ లో ఘటన
- కొడుకులతో కలిసి యువతిని హత్య చేసిన బీజేపీ నేత
- రెండేళ్ల తరువాత నిజం వెలుగులోకి
ఏ భాషలో విడుదలైనా మంచి విజయాన్ని సాధించిన 'దృశ్యం' సినిమా కథ తెలుసుగా? ఆ సినిమా చూసి, ఓ హత్యకు ప్లాన్ చేసిన తండ్రీ కొడుకులు, రెండేళ్ల పాటు నిజాన్ని దాచగలిగారు. చివరికి పోలీసుల విచారణలో నిజం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ లో రెండేళ్ల క్రితం మాయమైన యువతి మిస్టరీ, నిన్న సాయంత్రం వీడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇండోర్ కు చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీశ్ కరోటియా (65) అదే ప్రాంతానికి చెందిన ట్వింకిల్ దాగ్రే (22) అనే మహిళ మధ్య వివాహేతర బంధం ఏర్పడింది.
జగదీశ్ కు ముగ్గురు కుమారులు అజయ్, విజయ్, వినయ్ లకు ఈ విషయం తెలిసింది. తమ తండ్రితో విభేదించిన వీరు, ట్వింకిల్ తో గడిపితే సహించేది లేదని తేల్చి చెప్పారు. కుమారుల ఒత్తిడితో ట్వింకిల్ ను హతమార్చేందుకు జగదీశ్ అంగీకరించి, ప్లాన్ చేశాడు. ఆపై 'దృశ్యం' సినిమా చూసిన వీరంతా, అలాగే ప్లాన్ చేశారు. ట్వింకిల్ ను హత్య చేసి, తగులబెట్టారు.
ఆపై ఓ కుక్కను చంపి పూడ్చి పెట్టారు. కొంతకాలం తరువాత ఎవరినో హత్య చేసి, పూడ్చి పెట్టారన్న పుకారును లేవనెత్తారు. అప్పటికే ట్వింకిల్ అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్ తో రాగా, పూడ్చి పెట్టిన ప్రాంతంలో కుక్క కళేబరం మాత్రమే వారికి కనిపించింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. పోలీసులకు జగదీశ్ తో ట్వింకిల్ కు ఉన్న వివాహేతర బంధం గురించి తెలిసి ఆ దిశగా విచారించగా, వారిలో అనుమానాలు పెరిగాయి. జగదీశే హత్య చేసుండవచ్చన్న వారి అనుమానం నిజమై మిస్టరీ వీడింది. ట్వింకిల్ బ్రేస్ లెట్, ఇతర ఆభరణాలను రికవరీ చేశామని, నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.