Congress: నాకు బాధ్యత అప్పగించి ఉంటే వంద సీట్లు గెలిపించేవాడిని: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
- నా సోదరుడూ ఓడిపోవడం బాధనిపించింది
- పొత్తు పేరుతో కాలయాపన నష్టదాయకమైంది
- బలం లేకున్నా మిత్రపక్షాలకు సీట్లు కట్టబెట్టాం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలను చేజేతులా పోగొట్టుకున్నామని, పార్టీపరంగా జరిగిన కొన్ని నిర్ణయాలవల్లే నష్టపోవాల్సి వచ్చిందని నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు తనకు అప్పగించి ఉంటే వంద సీట్లకు తక్కువ కాకుండా గెలిపించే వాడినని చెప్పారు.
మునుగోడులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నా సోదరుడు కూడా ఎన్నికల్లో ఓడిపోవడం బాధనిపించిందన్నారు. పొత్తు పేరుతో మూడు నెలలపాటు కాలయాపన చేయడం, వారికి బలం లేదని తెలిసినా కొన్ని స్థానాలను మిత్రపక్షాలకు వదులుకోవడం నష్టదాయకమైందన్నారు. మిత్రపక్షాల పరిస్థితి ఏమిటో ఎన్నికల్లో స్పష్టంగా వెల్లడైందన్నారు.
ఇక ఎన్నికల ముందు తాను పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడం పార్టీ కోసమే తప్ప నేతలపై ఎటువంటి వ్యతిరేకత లేదని చెప్పారు. ఎప్పుడూ పరిస్థితులు ఇలాగే ఉండవని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన పనిలేదని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వ్యక్తిత్వమే గెలిపిస్తుంది కాబట్టి, కేడర్ జాగరూకతతో వ్యవహరించి సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు.