Gujarat: గుజరాత్లో జరిగిన 17 ఎన్కౌంటర్లలో మూడు నకిలీవే: తేల్చేసిన దర్యాప్తు కమిటీ
- సమీర్‌ఖాన్, కాసం జాఫర్, హలీ అలీ ఎన్కౌంటర్లు నకిలీవే
- అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు
- సుప్రీంకు నివేదిక అందించిన దర్యాప్తు కమిటీ
గుజరాత్లో 2002-2006 మధ్య జరిగిన 17 ఎన్కౌంటర్లలో మూడు నకిలీవని జస్టిస్ హెచ్ఎస్ బేడీ కమిటీ తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మూడు ఎన్కౌంటర్లలో పాల్గొన్న 9 మంది పోలీసు అధికారులపై చర్యలకు ప్రతిపాదించింది. రాష్ట్రంలో 2002-2006 మధ్య జరిగిన నకిలీ ఎన్కౌంటర్లపై దర్యాప్తు కోసం మార్చి 2, 2012లో గుజరాత్ ప్రభుత్వం మోనటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. అదే ఏడాది జస్టిస్ హెచ్ఎస్ బేడీని ఈ ప్యానెల్‌కు సుప్రీంకోర్టు చైర్మన్‌గా నియమించింది.
తాజాగా ఈ కమిటీ సుప్రీంకోర్టుకు ఎన్కౌంటర్లపై దర్యాప్తు నివేదికను అందించింది. మొత్తం 17 ఎన్కౌంటర్లలో మూడు నకిలీవని అందులో పేర్కొంది. ఈ మూడింటిలో పాల్గొన్న 9 మంది పోలీసు అధికారులపై చర్యలకు ప్రతిపాదించింది. 9 మంది అధికారుల్లో ముగ్గురు సీఐలు ఉన్నారు. అయితే, ఐపీఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు మాత్రం కమిటీ ప్రతిపాదించకపోవడం గమనార్హం. సమీర్ ఖాన్, కాసం జాఫర్, హజీ అలీ ఇస్మాయిల్ ఎన్కౌంటర్లు మూడు నకిలీవేనని దర్యాప్తు కమిటీ స్పష్టం చేసింది. ఈ ఎన్కౌంటర్లు మూడు అత్యంత సమీపం నుంచి జరిగినట్టు నివేదికలో పేర్కొంది.