Tamil Nadu: తమిళనాడు-కేరళ సరిహద్దులోని ఉదయకుళంగరలో 111.2 అడుగుల శివలింగం
- ప్రపంచంలోనే ఎత్తైనదిగా గుర్తింపు
- రూ.10 కోట్ల వ్యయంతో 2012లో దీని నిర్మాణం ప్రారంభం
- ప్రతి అంతస్తులో ధ్యాన మండపాలు
తమిళనాడు-కేరళ సరిహద్దులోని ఉదయకుళంగర ప్రాంతం ప్రపంచ గుర్తింపు సొంతం చేసుకుంటోంది. ఇక్కడి చెంగల్ మహేశ్వర శివపార్వతి ఆలయ ప్రాంగణంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 111.2 అడుగుల ఎత్తున్న శివలింగం ప్రపంచంలోనే ఎత్తైనదిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటికే ఎనభై శాతం పనులు పూర్తయిన దీన్ని ఎత్తయిన శివలింగంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు గుర్తించింది.
ఎనిమిది అంతస్తులుగా నిర్మిస్తున్న దీని పనులు 2012లో ప్రారంభించారు. శివలింగం లోపలి భాగం గుహను తలపించేలా ఉండడమేకాక, ప్రతి అంతస్తులోనూ ధ్యాన మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. పరశురాముడు, అగస్త్యుడు తపస్సు చేస్తున్నట్లు ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. కింది అంతస్తులో భక్తులు అభిషేకం, అర్చనలు చేసుకునేందుకు వీలుగా శివలింగం, ఎనిమిదో అంతస్తులో కైలాసగిరిలో కొలువై ఉన్న శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి నాటికి దీని నిర్మాణం పూర్తికానుందని భావిస్తున్నారు.