Rahul Gandhi: సొంత ప్రయోజనాలు కాపాడుకునే హక్కు పార్టీలకు ఉంది: యూపీ కొత్త పొత్తులపై రాహుల్‌గాంధీ
- ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై నిరాశ లేదు
- వారి అవసరాలు వారివి
- అక్కడ పార్టీ బలోపేతం ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం
రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాలు, అవసరాల మేరకు తీసుకునే నిర్ణయాలను తప్పుపట్టలేమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తును ఈ దృష్టితోనే చూస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ ఈ పొత్తు అంశంపై మాట్లాడారు.
పొత్తు సందర్భంగా శనివారం మాయావతి మాట్లాడుతూ ‘గత అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలవడం వల్ల తమకు పెద్దగా ఒరిగేదేమీ లేదని బావిస్తున్నాం. అందుకే వారిని కలుపుకోలేదు. మరోవైపు దేశ రక్షణ అవసరాల ఒప్పందాల్లో బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ వారి మధ్య పొత్తు కుదిరినంత మాత్రాన తానేమీ నిరాశ చెందడం లేదని చెప్పారు. ఆ పార్టీ నాయకుల పట్ల తనకు అపార గౌరవం ఉందన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత తమ ముందుందని, ఆ దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూటములు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ చురుకుగా దూసుకుపోతోందని తెలిపారు.