Karnataka: కుమారస్వామి కర్ణాటక సీఎంలా కాకుండా క్లర్క్‌లా వ్యవహరిస్తున్నారు: ప్రధాని మోదీ ఎద్దేవా

  • కాంగ్రెస్‌ కు ఊడిగం చేస్తున్నారని వ్యాఖ్యలు
  • ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన కాంగ్రెస్‌ నేతలు
  • నిప్పులు చెరిగిన సిద్ధరామయ్య

కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతల ఒత్తిడి భరించలేక ముఖ్యమంత్రి కుమారస్వామి క్లర్క్‌లా వారికి ఊడిగం చేస్తున్నారని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని రాంలీలా మైదానంలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో కర్ణాటక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని కర్ణాటకలోని కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.ముఖ్యమంత్రిగా స్వయం నిర్ణయాధికారం ఉన్నా కుమారస్వామి కాంగ్రెస్‌కు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.

దీంతో ప్రధాని వ్యాఖ్యలపై సమన్వయక కమిటీ చైర్మన్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య నిప్పులు చెరిగారు. సమన్వయంతో సాగుతున్న సంకీర్ణ ప్రభుత్వంలో కుట్రతో చిచ్చుపెట్టే ప్రయత్నం ప్రధాని చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేడీఎస్‌ నేతలు కాంగ్రెస్‌ నేతలపై వ్యతిరేకత పెంచుకునేలా ప్రధాని కుట్రపన్నుతున్నారని ధ్వజమెత్తారు. సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగుతోందని, ప్రధాని కుట్రలు ఫలించవని అన్నారు.

మరోవైపు కాంగ్రెస పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గుండూరావు కూడా ప్రధాని మాటలను తప్పుపట్టారు. ప్రధాని హోదాలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఆయనకు సరికాదన్నారు. కర్ణాటకను ప్రధాని పదేపదే టార్గెట్‌ చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి వెంకటరమణప్ప మాట్లాడుతూ ప్రధాని తరహాలో కర్ణాటక సీఎం ఏకఛత్రాధిపత్యం వహించడం లేదని, ఒక ముఖ్యమంత్రి పట్ల ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. పలువురు మంత్రులు కూడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టారు. కాగా, బీజేపీ నేతలు ప్రధాని వ్యాఖ్యలను సమర్థించారు. ప్రస్తుతం కుమారస్వామి ఎదుర్కొంటున్న పరిస్థితినే ప్రధాని ప్రస్తావించారని వెనకేసుకు వచ్చారు.

  • Loading...

More Telugu News