praja shanti party: బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదని రెండేళ్లుగా కృషి చేస్తున్నా: పాల్
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100-110 స్థానాలొస్తాయి
- బీజేపీ 125 సీట్లు సాధిస్తుంది
- సేవ్ సెక్యులర్ ఇండియాకు 300 సీట్లు లభిస్తాయి
వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తాము అధికారంలోకొస్తామని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి జోస్యం చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100-110, బీజేపీకి 125 సీట్లు, తాను ఏర్పాటు చేయబోయే సేవ్ సెక్యులర్ ఇండియాకు 300 సీట్లు లభిస్తాయని జోస్యం చెప్పారు. బీజేపీ అధికారంలోకి రాకూడదని సుమారు రెండేళ్లుగా కృషి చేస్తున్నానని, టీడీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఎందుకంటే, ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీతో ఆ పార్టీ కలిసిపోతుందన్న అనుమానం వ్యక్తం చేశారు.
మొన్నటి వరకూ రాహుల్ గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు, ఇప్పుడు ఆయనతో కలిసి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు, చంద్రబాబు పాలసీలు తనకు అర్థం కావట్లేదని, అందుకే, చంద్రబాబును చర్చకు రమ్మంటున్నానని అన్నారు. రూ. లక్షల కోట్లు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెబుతున్న తనను చంద్రబాబు ఎందుకు పిలవట్లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు 82 సార్లు ఫోన్ చేసినా తనను పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో చంద్రబాబు ఎందుకు విఫలమయ్యారు? రాహుల్ ప్రధాని కారు, ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తన తమ్ముడి లాంటి వాడని, తన సర్వే ప్రకారం ఆయన ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధించలేరంటూ వ్యాఖ్యలు చేశారు.