Ramgopal varma: ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబూ కాదు, జగనూ కాదు.. కేఏ పాల్!: రాంగోపాల్ వర్మ వ్యంగ్యం
- ప్రజాశాంతి పార్టీ ఏపీలో 175 స్థానాల్లో గెలుస్తుంది
- కేఏ పాల్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి
- బాబు, జగన్, మోదీ లాంటి చిన్న వ్యక్తులతో పోటీనా?
రోజుకో ట్వీటుతో ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు అటువంటి ట్వీటే చేశాడు. అయితే, ఈసారి ఆయన ట్వీట్లకు ముడిసరుకుగా మారింది మాత్రం కేఏపాల్. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీ ఏపీలో విజయం సాధిస్తుందని, మొత్తం 175 స్థానాలను గెలుచుకుంటుందని పేర్కొన్నాడు. ఏపీకి తదుపరి ముఖ్యమంత్రి కేఏ పాలేనని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. నిజానికి జీసస్ క్రైస్ట్ తర్వాత మళ్లీ అంతటి గొప్ప వ్యక్తి పాలేనని సెటైర్ వేస్తూ ప్రధాని మోదీతో పాల్ కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశాడు.
మరో ట్వీట్లో ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి అయిన పాల్ ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి బదులు, చంద్రబాబు, జగన్, మోదీ, ట్రంప్ లాంటి చిన్న వ్యక్తులతో పోటీ పడడానికి బదులు తన స్నేహితుడు జీసస్ క్రైస్ట్ను అడిగి ప్రపంచ ఎన్నికలు జరిగేలా చూసి ఏకంగా ప్రపంచ నేత కావాలని వ్యంగ్యోక్తులు విసిరాడు.