Mutton: పండుగ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మాంసం ధర!
- గత మూడు నాలుగు రోజుల్లోనే రూ. 60 వరకు పెరిగిన ధర
- పెరుగుతున్న తలసరి వినియోగం
- ఏటా 20 శాతం పెరుగుతున్న మాంసం డిమాండ్
పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మాంసానికి గిరాకీ పెరిగింది. ఫలితంగా మటన్ ధరలు ఒక్కసారిగా పైకెగశాయి. గత మూడు నాలుగు రోజుల్లోనే ప్రాంతాలను బట్టి కిలోకు రూ. 50 నుంచి రూ. 60 వరకు పెరిగింది. దీంతో కిలో మాంసం ధర ఏకంగా రూ. 600 దాటేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు హైదరాబాద్ వచ్చి మేకలు, గొర్రెలను కొనుగోలు చేస్తుండడమే ధర పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
నిజానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే మేకలు, గొర్రెల సంఖ్య ఎక్కువ. మహారాష్ట్ర వ్యాపారులు నిన్నమొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో మేకలు, గొర్రెలను విక్రయించేవారు. అయితే, ఇటీవల అది కూడా తగ్గడంతో మాంసం ధరలు ఊపందుకున్నాయి. అలాగే, తలసరి మాంసం వినియోగం పెరుగుతుండడం కూడా ఇందుకు మరో కారణమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా మాంసం డిమాండ్ ఏటా 20 శాతం పెరుగుతోందని పశుసంవర్థక శాఖ కూడా చెబుతోంది.