ban on toboco in election day: ఎన్నికల రోజు మద్యంతోపాటు ధూమపానంపైనా నిషేధం: ఎన్నికల సంఘం
- తాజాగా ఉత్తర్వులు జారీచేసిన ఈసీ
- పోలింగ్ బూత్ సమీపంలో సిగరెట్ల అమ్మకాలకు బ్రేక్
- భారత ఎన్నికల చరిత్రలోనే తొలిసారి
ఎన్నికలు జరుగుతున్నాయంటే మద్యంపై నిషేధం తెలిసిన విషయమే. పోలింగ్‌కు ముందు రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు దీన్ని ఇప్పటి వరకు అమలు చేస్తున్నారు. అలాగే ఓట్ల లెక్కింపు రోజు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం భారత ఎన్నికల చరిత్రలోనే తొలిసారి సరికొత్త నిర్ణయం తీసుకుంది. అది ధూమపానంపై నిషేధం!
ఎన్నికల రోజు మద్యంతోపాటు, సిగరెట్లు అమ్మే షాపులు కూడా మూసేయాల్సిందేనంటూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను డిసెంబరు చివరి వారంలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలకు జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది.
జిల్లా ఎన్నికల అధికారి, మేజిస్ట్రేట్‌గా వ్యవహరించే కలెక్టర్లకు ఈ ఉత్తర్వులు అందాయి. పోలింగ్ బూత్ వద్ద మద్యం, సిగరెట్లపై నిషేధం అమల్లో ఉన్నట్లు తెలియజేసే బ్యానర్లు వేలాడదీయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేసే టుబాకో కంట్రోల్ సెల్స్ బ్యానర్ల ఏర్పాటును పర్యవేక్షిస్తాయి. సిగరెట్లతోపాటు పొగాకు ఉత్పత్తులైన బీడీ, గుట్కా, నమిలే పొగాకు తదితరాలపై కూడా నిషేధం ఉంటుంది. ప్రతి బూత్ ప్రిసైడింగ్ అధికారులు తమ పరిధిలోని మద్యం, సిగరెట్ అమ్మకాలు దుకాణాలు మూసివేసిందీ లేనిదీ చెక్ చేసుకోవాలి.
2019లో జరిగే ఎన్నికల నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే నష్టంపై ప్రజల్లో కొంతైనా అవగాహన కలిగి, కొందరైనా దీనికి దూరమైతే మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అమల్లోకి తేవాలని భావించినట్లు ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.