kumaraswamy: కుమారస్వామి స్థానంలో నేను ఉంటే.. 24 గంటల్లో బీజేపీ కుట్రల్ని బయటపెట్టేవాడిని: మంత్రి డీకే శివకుమార్
- కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ ను బీజేపీ చేపట్టింది
- బీజేపీ క్యాంపులో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు
- కుమారస్వామి బీజేపీ పట్ల కొంత అనుకూలతతో ఉన్నారు
కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆపరేషన్ లోటస్ (కమలం)ను బీజేపీ చేపట్టిందని కాంగ్రెస్ నేత, మంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలకు తెగబడుతోందని మండిపడ్డారు. ముంబైలో ఓ హాటల్ లో ఏర్పాటు చేసిన క్యాంపులో కర్ణాటక కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. వారితో పలువురు బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని చెప్పారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో బీజేపీ చాలా బిజీగా ఉందని శివకుమార్ దుయ్యబట్టారు. తమ ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎంత మేర ఆఫర్ చేశారనే సమాచారం కూడా తమ వద్ద ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీ పట్ల కొంత మేర సానుకూలంగా ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, సానుకూలత అంటే మరో విధంగా అనుకోవద్దని... బీజేపీ గురించి తనకు తెలిసిన విషయాలను కుమారస్వామి బయటకు వెల్లడించడం లేదని... ఈ కోణంలోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. బీజేపీ చేస్తున్న కుట్రలను కుమారస్వామి, సిద్ధరామయ్యల దృష్టికి కూడా తాము తీసుకెళ్లామని తెలిపారు.
వేచి చూసే ధోరణిని కుమారస్వామి అవలంబిస్తున్నారని శివకుమార్ అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో తాను ఉండి ఉంటే... బీజేపీ కుట్రలన్నింటినీ 24 గంటల్లో బయటపెట్టేవాడినని తెలిపారు. సంక్రాంతి తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుందని సీఎం చెబుతున్నారని... ఏ మార్పు వస్తుందో చూడాలని అన్నారు.