sundeep kishan: కొత్త కాన్సెప్ట్ కి ఓకే చెప్పిన యంగ్ హీరో
- సక్సెస్ కోసం సందీప్ కిషన్ వెయిటింగ్
- క్రీడా నేపథ్యంలో సాగే కథ
- దర్శకుడిగా సంతోష్ జాగర్లపూడి
సందీప్ కిషన్ సక్సెస్ పేరు విని చాలా కాలమే అయింది. తనకి నచ్చిన కథలను మాత్రమే చేస్తూ వెళుతున్నా, విజయమనేది ఆయనతో దోబూచులాడుతూనే వుంది. ప్రస్తుతం 'నిను వీడని నీడను నేనే' సినిమా చేస్తోన్న ఆయన, తాజాగా మరో యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 'సుబ్రహ్మణ్య పురం' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ జాగర్లపూడి, రీసెంట్ గా సందీప్ కిషన్ కి క్రీడా నేపథ్యంలో సాగే ఒక కథను వినిపించాడట.
కథలోని కొత్తదనం కారణంగా .. ఆ తరహా కథలు చాలా అరుదుగా వచ్చిన కారణంగా సందీప్ కిషన్ వెంటనే ఓకే చెప్పేశాడట. ద్రోణాచార్యుడి ప్రతిమను గురువుగా భావించి విలువిద్యను నేర్చుకుంటాడు ఏకలవ్యుడు. అందుకు ఆయన కుడిచేతి బొటనవ్రేలును గురు దక్షిణగా అడుగుతాడు ద్రోణాచార్యుడు. ఆధునిక కాలంలో అలాంటి ఒక గురువు తన శిష్యుడిని ఎలాంటి గురుదక్షిణ అడిగాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా కొనసాగనుంది. 'కార్తికేయ' చిత్రాన్ని నిర్మించిన వెంకట శ్రీనివాస్ .. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.