Singapore: గన్నవరం విమానాశ్రయంలో కిక్కిరిసిపోతున్న సింగపూర్ విమానాలు.. ఫుల్ డిమాండ్!
- సింగపూర్ సర్వీసులపై అధికారుల అంచనాలు తలకిందులు
- నెల రోజుల్లోనే పెరిగిన రద్దీ
- 90 శాతం ఆక్యుపెన్సీతో సేవలు
విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. గన్నవరం విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటోంది. ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో వారంలో రెండు రోజులు సింగపూర్ సర్వీసులు అందిస్తోంది. ఇందులో భాగంగా మంగళ, గురువారాల్లో 180 సీట్ల సామర్థ్యం ఉన్న ఎ320 విమానాలను నడుపుతోంది. గతేడాది డిసెంబరు 4న సేవలు ఆరంభం కాగా, తొలి రోజు నుంచే డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ సేవలు ప్రారంభమై 40 రోజులు కూడా పూర్తికాకుండానే ఏకంగా 90 శాతానికిపైగా ఆక్యుపెన్సీ సాధించింది. జనవరి ఒకటో తేదీన ఇక్కడి నుంచి బయలుదేరిన విమానంలోని 180 సీట్లూ నిండిపోయాయంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
సింగపూర్ సర్వీసులు ప్రారంభించాక ఆక్యుపెన్సీ 50 శాతం కంటే తక్కువగా ఉంటే లోటు సర్దుబాటు నిధి (వీజీఎఫ్) కింద ఆరు నెలలకు రూ. 18 కోట్ల చొప్పున చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం ఇండిగోతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆ అవసరం ప్రభుత్వానికి లేకుండా పోయింది. ప్రయాణికులు అలవాటు పడేందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారులు భావించారు. అయితే, నెల రోజుల్లోపే ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఇండిగో ఆనందం వ్యక్తం చేసింది.