Andhra Pradesh: చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఉంటుంది.. ఏపీలో బలమైన పార్టీకే మద్దతు ఇస్తాం!: తలసాని
- బాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతోంది
- గోదావరి జిల్లాల్లో పరిస్థితి మారిపోయింది
- భీమవరంలో సంక్రాంతి వేడుకల్లో తలసాని
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతుంటే, ఏపీ మాత్రం అవినీతిలో కూరుకుపోతోందని టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో స్నేహితులతో కలిసి తలసాని ఈరోజు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్రాంతి వేడుకలు ఉభయ గోదావరి జిల్లాల్లో అద్భుతంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు. తాను ఎప్పుడు వచ్చినా భీమవరం రాజులు ఇక్కడ బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇస్తారని ప్రశంసించారు.
ప్రతీ సోమవరం పోలవరం అని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారనీ, ఇంకో ఐదేళ్లు అయినా అది పూర్తవుతుందా? అని తలసాని ప్రశ్నించారు. తాము ప్రతీవారం వెళ్లకున్నా కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం పరిస్థితి ఆశాజనకంగా లేదని స్పష్టం చేశారు. తాను ఇక్కడి ప్రజలతో రాత్రి 2 గంటల వరకూ మాట్లాడానని తలసాని పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో టీడీపీకి పట్టుగొమ్మలుగా నిలిచిన గోదావరి జిల్లాల్లో పరిస్థితి మారిపోయిందని ఆయన తేల్చిచెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామనీ, అందుకోసం ఏపీలోని ఓ బలమైన పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు.
ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ కావడానికి సీఎం చంద్రబాబే కారణమని తలసాని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటూ కుల రాజకీయం చేశారనీ, కాంగ్రెస్ పార్టీకి దాసోహం అంటున్నారని మండిపడ్డారు. ఏపీలో బీసీలను అధికారం కోసమే వాడుకుంటున్నారనీ, వాస్తవానికి వారికి రాజ్యాధికారం దక్కడం లేదని స్పష్టం చేశారు. గ్రాఫిక్స్ తో బాహుబలిని మించిన నిర్మాణం జరుగుతున్నట్లు ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.