team india: విరుచుకుపడ్డ కోహ్లీ.. మెరిసిన ధోనీ.. భారత్ ఘన విజయం!

  • మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను చేరుకున్న ఇండియా
  • 104 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
  • అర్ధశతకంతో సత్తా చాటిన ధోనీ

అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా విసిరిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 112 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కోహ్లీ 104 పరుగులు చేసి రిచర్డ్ సన్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు (43.4 ఓవర్లు). మరో 38 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పటికి ధోనీ 25 పరుగులతో ఆడుతున్నాడు. ఈ తరుణంలో అందరిలో ఉత్కంఠ పెరిగిపోయింది.

ఈ తరుణంలో ధోనీకి జత కలిసిన దినేష్ కార్తీక్ వేగంగా ఆడాడు. మరోవైపు ధోనీ కూడా బ్యాట్ కు పని కల్పించాడు. మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడుతూ వీరిద్దరూ భారత్ ను విజయతీరాలకు చేర్చారు. చివరి ఓవర్లో విజయానికి 7 పరుగులు అవసరమైన దశలో... తొలి బంతినే ధోనీ సిక్సర్ గా మలిచాడు. రెండో బంతికి సింగిల్ చేసి భారత్ కు ఘన విజయం కట్టబెట్టాడు. భారత్ బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ 43, ధావన్ 32, రాయుడు 24 పరుగులు చేశారు. ధోనీ 55 రన్స్ (54 బంతులు, 2 సిక్సర్లు), దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 25 పరుగులు (2 ఫోర్లు) చేసి నాటౌట్ గా నిలిచారు. ఆసీస్ బౌలర్లు బెహ్రన్ డార్ఫ్, రిజర్డ్ సన్, స్టోయినిస్, మ్యాక్స్ వెల్ లు చెరో వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఒకానొక దశలో 134 పరుగులకే ఆస్ట్రేలియా 4 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో షాన్ మార్ష్ ఆపద్బాంధవుడి పాత్రను పోషించి 123 బంతుల్లో 131 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో ఫించ్ 6, ఖవాజా 21, హ్యాండ్స్ కోంబ్ 20, స్టోయినిస్ 29, మ్యాక్స్ వెల్ 48, రిచర్డ్ సన్ 2, సిడిల్ 0 పరుగులు చేశారు. లియోన్ 12, మెహ్రన్ డార్ఫ్ 1 పరుగుతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, షమీ 3, జడేజా ఒక్క వికెట్ తీశారు.

సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. సిరీస్ ను నిర్ణయించే చివరి వన్డే ఎంసీజీలో శుక్రవారం జరగనుంది. 

  • Loading...

More Telugu News