Arun Jaitly: చికిత్స కోసం హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయిన అరుణ్ జైట్లీ
- కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జైట్లీ
- గత మే నెలలో మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న ఆర్థిక మంత్రి
- గతంలో బేరియాట్రిక్, హార్ట్ సర్జరీలు కూడా జరిగాయి
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న రాత్రి హఠాత్తుగా అమెరికాకు వెళ్లిపోయారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన ఆయనకు డయాలసిస్ నిర్వహించారు. అనంతరం గత మే 14న ఆయనకు మూత్రపిండాల మార్పిడి సర్జరీ నిర్వహించారు. గతంలో 2014 సెప్టెంబర్ లో బరువు తగ్గడం కోసం ఆయన బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. అధిక బరువు వల్ల ఆయనకు షుగల్ లెవెల్స్ పెరిగిపోతుండటమే దీనికి కారణం. అలాగే కొన్నేళ్ల క్రితం ఆయనకు హార్ట్ సర్జరీ కూడా జరిగింది.
విషయానికి వస్తే... గత మే నెలలో మూత్రపిండాల మార్పిడి సర్జరీ జరిగిన తర్వాత జైట్లీ విదేశాలకు వెళ్లలేదు. అనారోగ్య కారణాల వల్ల విదేశీ ప్రయాణాలను ఆయన రద్దు చేసుకున్నారు. గత ఏప్రిల్ లో లండన్ లో జరిగిన 10వ ఇండియా-యూకే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ సమావేశాలకు ఆయన షెడ్యూల్ ఖరారైనప్పటికీ... కిడ్నీ సమస్యతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. తాజాగా, మెడికల్ చెకప్ కోసమే నిన్న రాత్రి అమెరికాకు జైట్లీ వెళ్లారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1న తన 6వ బడ్జెట్ ను, ఎన్డీయే చివరి బడ్జెట్ ను పార్లమెంటులో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే అయినప్పటికీ... ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ మాదిరే ఉండవచ్చని చెబుతున్నారు.