Rohit Sharma: సిక్సర్లలో క్రిస్‌గేల్ రికార్డును బద్దలుగొట్టిన రోహిత్ శర్మ
- ఇంగ్లండ్‌పై గేల్ 88 సిక్సర్లు
- 89 సిక్సర్లతో రోహిత్ రికార్డు
- అడిలైడ్ వన్డేలో రోహిత్ ఘనత
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డును బద్దలుగొట్టాడు. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో రెండు సిక్సర్లు బాదిన రోహిత్.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అడిలైడ్ వన్డేలో మొత్తం 52 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 2 ఫోర్లు, రెండు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. ఈ రెండు సిక్సర్లతో కలిపి ఆసీస్ జట్టుపై రోహిత్ నమోదు చేసిన సిక్సర్ల సంఖ్య 89కి చేరుకుంది.
విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఇంగ్లండ్ జట్టుపై 88 సిక్సర్లు కొట్టాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో ఇప్పటి వరకు గేల్ పేరు అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు రోహిత్ 89 సిక్సర్లతో అతడిని వెనక్కి నెట్టాడు. 31 ఏళ్ల రోహిత్ తన 12 ఏళ్ల కెరియర్లో ఇప్పటి వరకు 195 వన్డేలు ఆడగా 210 సిక్సర్లు కొట్టాడు. ఇందులో 89 కంగారూలపైనే కావడం గమనార్హం.