speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిపై నేడు కేసీఆర్ కీలక నిర్ణయం
- ఈరోజు పేరు వెల్లడయ్యే అవకాశం
- సామాజిక వర్గం, సభ నిర్వహణ సామర్థ్యం, సీనియారిటీకి ప్రాధాన్యం
- నలుగురి పేర్లు పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం
తెలంగాణ అసెంబ్లీ రెండో శాసన సభాపతి ఎవరన్నది ఈరోజు తేలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సీనియారిటీ, సభ నిర్వహణ సామర్థ్యంతోపాటు సామాజిక వర్గం సమతూకం కూడా కుదిరేలా సీఎం ఇప్పటికే కసరత్తు చేశారని తెలుస్తోంది. దాదాపు అరుగురి పేర్లు పరిశీలనకు రాగా, ప్రాథమికంగా నలుగురి పేర్లను సీఎం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మదేవేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్లో ఒకరికి సభాపతి పీఠం దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే వీరంతా సభాపతి కంటే మంత్రి పదవిపైనే మక్కువ చూపుతున్నట్లు సమాచారం. శాసన సభాపతిగా పనిచేస్తే మళ్లీ గెలవరన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నలుగురు నేతలను సీఎం కేసీఆర్ స్వయంగా పిలిచి మాట్లాడారు. సభాపతిగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే కావడంతో ఈ రోజు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.