Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు.. కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా టోల్ దోపిడీ!
- సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ప్రజలు
- టోల్ రద్దుచేసినా వసూలు ఎందుకని ప్రశ్న
- తమకు ఆదేశాలు అందలేదంటున్న టోల్ సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఉన్న కీసర టోల్‌ప్లాజా వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈరోజు టోల్ ఫీజును వసూలు చేయరాదని ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అక్కడి సిబ్బంది ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో పలువురు వాహనదారులు టోల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు అసలు టోల్ ఫీజు ఎందుకు కట్టాలంటూ వాగ్వాదానికి దిగారు.
అయితే ఈరోజు టోల్ ఫీజు వసూలు చేయరాదని తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని టోల్ సిబ్బంది స్పష్టం చేశారు. ఏదైనా ఉత్తర్వులు అందితేనే మినహాయింపు ఇవ్వగలమని వ్యాఖ్యానించారు. కాగా, ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.