kanhaiya kumar: టెర్రరిస్టులను కీర్తిస్తున్న వారితో జతకట్టిన మీకు.. కన్హయ్యను విమర్శించే అర్హత ఎక్కడుంది?: బీజేపీపై శివసేన ఫైర్
- జేఎన్ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్హయ్యపై దేశ ద్రోహం కేసు
- కసబ్ కు అవకాశం ఇచ్చినట్టుగానే.. తన వాదన వినిపించే అవకాశం కన్హయ్యకు ఇవ్వాలన్న శివసేన
- ఆరోపణల్లో నిజం లేకపోతే కేసు నిలవదన్న ఉద్ధవ్ థాకరే
విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ ను విమర్శించే నైతికత బీజేపీకి ఎక్కడిదని శివసేన మండిపడింది. కన్హయ్యపై దేశద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పని చేసిన కన్హయ్య కేసును రాజకీయ లబ్ధికోసం బీజేపీ వాడుకుంటోందని మండిపడింది. జమ్ముకాశ్మీర్ లో ముఫ్తీకి చెందిన పీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ పాపానికి ఒడిగట్టిందని విమర్శించింది. పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును అమరవీరుడిగా కీర్తించిన ఘనత మెహబూబా ముఫ్తీదని విమర్శించారు. పీడీపీతో కలసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పీడీపీకి బీజేపీ మద్దతును ఉపసంహరించుకుంది.
తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ముంబై దాడులకు పాల్పడిన టెర్రరిస్టు కసబ్ కు కూడా కోర్టు ఒక అవకాశం ఇచ్చిందని... కన్హయ్యకు కూడా అదే విధంగా ఒక అవకాశం ఇవ్వాలని తన పత్రిక సామ్నాలో శివసేన కోరింది. విద్యార్థి నాయకుడిగా నిరుద్యోగ యువతకు నాయకత్వం వహిస్తున్న కన్హయ్య... స్వతంత్ర కశ్మీర్, అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం తప్పేనని... అయినా, ఆయనను విమర్శించే అర్హత బీజేపీకి ఎక్కడిదని ప్రశ్నించింది. టెర్రరిస్టులను కీర్తిస్తున్న ముఫ్తీతో జతకట్టిన మీరు... కన్హయ్యను ఎలా విమర్శిస్తారని మండిపడింది.
మహారాష్ట్ర బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ ఇటీవల మాట్లాడుతూ, తనను ఎక్కడికి పంపినా బీజేపీని గెలుపొందేలా మ్యాజిక్ చేస్తానని చెప్పారని... దేశ వ్యతిరేక శక్తులను ఓడించేందుకు ఆయనను జేఎన్ యూనివర్శిటీకి పంపాలని శివసేన ఎద్దేవా చేసింది. అయితే, జేఎన్ యూనివర్శిటీలో ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరగవనే విషయాన్ని ఆయనకు చెప్పాలని సూచించింది. మరోవైపు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ, కన్హయ్యపై పేర్కొన్న ఆరోపణల్లో నిజం లేకపోతే... కోర్టులో కేసు నిలవదని చెప్పారు.