british family: పందుల కంటే అధ్వానంగా ఉన్నారు.. దేశం విడిచి వెళ్లిపోండి: బ్రిటీష్ కుటుంబంపై న్యూజిలాండ్ ఆగ్రహం
- న్యూజిలాండ్ టూర్ కు వచ్చిన బ్రిటీష్ ఫ్యామిలీ
- చెత్త వేయడం, నోటికొచ్చినట్టు మాట్లాడటం, రెస్టారెంటు బిల్లులు ఎగ్గొట్టడం చేస్తున్న వైనం
- డిపోర్టేషన్ నోటీసులు జారీ చేసిన న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్
పందుల కంటే అధ్వానంగా ఉన్నారంటూ ఓ బ్రిటీష్ కుటుంబంపై న్యూజిలాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు వారిని సొంత దేశానికి పంపించేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఆక్లండ్, హామిల్టన్ ప్రాంతాల్లో ఈ బ్రిటీష్ కుటుంబం పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎక్కడపడితే అక్కడ చెత్తా చెదారం వేయడం, పక్కవారితో దురుసుగా ప్రవర్తించడం, రెస్టారెంట్లలో బిల్లు ఎగ్గొట్టడం వంటి ఆరోపణలు వారిపై ఉన్నాయి.
ఈ సందర్భంగా ఆక్లండ్ మేయర్ ఓ రేడియో స్టేషన్ ద్వారా మాట్లాడుతూ, వీరు జలగలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆహారంలో చీమ కానీ, వెంట్రుక కానీ వచ్చిందని ఒక్కసారి చెబితే నమ్మవచ్చని... తిండి తిన్న ప్రతిసారీ ఇవే సాకులు చెబుతూ బిల్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే ఎలా నమ్ముతామని అన్నారు. పందుల కంటే వీరు దారుణంగా ఉన్నారని... వీరిని దేశం నుంచి వెళ్లగొట్టాలని వ్యాఖ్యానించారు.
న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పీటర్ మాట్లాడుతూ, వీరికి డిపోర్టేషన్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. మరోవైపు, ఒక పెట్రోల్ స్టేషన్ నుంచి 37 డాలర్ల గూడ్స్ ను దొంగిలించినట్టు వీరి కుటుంబంలోని 26 ఏళ్ల వ్యక్తి ఒప్పుకున్నాడు. ఓ ప్రముఖ బీజ్ లో వీరు బీరు బాక్సులు, బాటిల్స్, ఇతర చెత్తను పడేసిన వీడియో న్యూజిలాండ్ లో వైరల్ అవుతోంది. చెత్తను క్లీన్ చేయాలని అడిగిన ఓ మహిళకు వీరి కుటుంబంలోని ఓ చిన్నారి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా వీడియోలో ఉంది. కొడితే మెదడు బయటకు వస్తుందంటూ హెచ్చరించింది.
ఈ పరిణామాలన నేపథ్యంలో వీరి కుటుంబంలోని ఒక సభ్యుడు మాట్లాడుతూ, త్వరలోనే న్యూజిలాండ్ టూర్ ను ముగించుకుని ఇంగ్లండ్ వెళ్లిపోతామని చెప్పాడు. ఇంగ్లండ్ లోని టాప్ 10 ధనవంతుల్లో తమ తాత ఒకరని... అలాంటి తమకు న్యూజిలాండ్ లో అవమానం జరిగిందని మండిపడ్డాడు.