ys sharmila: 10 వెబ్ సైట్లతో షర్మిలపై దుష్ప్రచారం.. విచారణను ముమ్మరం చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు!
- యూట్యూబ్ ఛానల్, ఫేస్ బుక్ లో తప్పుడు ప్రచారం
- సమాచారం కోసం లేఖలు రాసిన పోలీసులు
- 15 రోజుల్లో నిందితులను పట్టుకుంటామని ప్రకటన
తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ ను కలుసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడి సైబర్ క్రైమ్ అధికారులు కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ విషయమై అదనపు డీసీపీ రఘువీర్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ షర్మిలపై అభ్యంతరకరమైన వార్తలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న 10 వెబ్ సైట్లను గుర్తించామని ఆయన తెలిపారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఫేస్ బుక్ లో ఎక్కువగా ఇలాంటి సందేశాలు ఉన్నాయన్నారు. వీటి యూఆర్ఎల్ లపై దర్యాప్తు చేయిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ వీడియోలు తయారుచేసినవారితో పాటు వాటి వెనుక ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో షర్మిలపై తప్పుడు ప్రచారం చేసి అరెస్టయిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామనీ, తాజా ఘటనలో వారి ప్రమేయం ఉందా? లేదా? అనే విషయాన్ని విచారిస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు. నిందితులకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా ఫేస్ బుక్, యూట్యూబ్ లకు లేఖలు రాశామనీ, త్వరలోనే ఆ వివరాలు అందుతాయని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం 15 రోజుల్లో తేలిపోతుందని స్పష్టం చేశారు.