Andhra Pradesh: నగదు, కాంట్రాక్టులకు కక్కుర్తిపడి ఎంతకు దిగజారిపోయావ్ జగన్మోహన్ రెడ్డి!: దేవినేని ఉమ ఆగ్రహం
- ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారు
- ముగ్గురు మోదీలు జగన్నాటకం ఆడుతున్నారు
- జగన్ కు ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారు
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడానికి జగన్ ఫెడరల్ ఫ్రంట్ బాగోతానికి తెరలేపారని టీడీపీ నేత, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కేసీఆర్ ప్రారంభిస్తామని చెబుతున్న కూటమి ఫెడరల్ ఫ్రంట్ కాదనీ, అది మోదీ ఫ్రంట్ అని దుయ్యబట్టారు.
ఏపీ సీఎం చంద్రబాబు మీద కక్షతో, టీడీపీని దెబ్బతీయాలన్న ఆలోచనలతో ముగ్గురు మోదీలు(మోదీ, కేసీఆర్, జగన్) జగన్నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ‘తెలంగాణలో కలవని జాతి ఒకటే ఒకటి అది ఆంధ్రోళ్ల జాతి’ అని కేసీఆర్ దుషించారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తులతో జగన్ చేతులు కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ మాట్లాడారు.
ఆంధ్రా కుక్కల్లారా.. 24 గంటల్లో వెళ్లిపోండి. లేదంటే తన్ని వెళ్లగొడతా.. అని కేసీఆర్ కామెంట్ చేశారని ఉమ గుర్తుచేశారు. తాము ఎద్దులు, ఆవులకు పెట్టే ఉలవచారును ఆంధ్రా వాళ్లు తింటారని కేసీఆర్ చెప్పారన్నారు. నన్నయ్య ఆది కవి అంట.. అసలు అతను కవే కాదు అంటూ కేసీఆర్ అవమానించారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తితో చేతులు కలపడానికి జగన్ కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో సీమాంధ్రులు ఎప్పటికైనా కిరాయిదారులే అని చెప్పారు. ‘జగన్మోహన్ రెడ్డి.. ఇది నీకు వినిపిస్తుందా?’ అని ప్రశ్నించారు.
‘నగదు, కాంట్రాక్టులకు కక్కుర్తి పడి ఎంతకు దిగజారిపోయావ్ జగన్మోహన్ రెడ్డి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా బాపనోళ్లకు మంత్రాలు కూడా తెలియవన్న కేసీఆర్.. ఇప్పుడు అక్కడకు వచ్చి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు అడుగులు కాదు.. నాలుగు వేల అడుగులు ముందుకు వేసినా జగన్ కు ప్రజలు గుణపాఠం చెప్పితీరుతారని హెచ్చరించారు. ఈరోజు ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి జగన్ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.