Jagan: జగన్ ఏమైనా అంటరానివాడా.. ఏపీలో చంద్రబాబును బొందపెడతాం: టీఆర్ఎస్ ఎంపీ సీతారాంనాయక్
- కేటీఆర్-జగన్ భేటీపై టీడీపీకి ఉలికిపాటు ఎందుకో
- ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే భేటీ
- గుణాత్మక మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి-టీఆర్ఎస్ నేత కేటీఆర్ భేటీపై టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ స్పందించారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం చర్చించేందుకే ఇద్దరు నేతలు కలిశారని, దీనికి మరే ఇతర ప్రాధాన్యం లేదని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను బొందపెట్టాలని చూసిన చంద్రబాబును ఏపీలో ఓడించేందుకు తాము అక్కడ కూడా ప్రచారం చేస్తామని చెప్పారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వెనక బీజేపీ ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపడేశారు. దేశంలో గుణాత్మకమైన మార్పు కోసమే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. జగన్‌తో భేటీ ఇందులో భాగమేనని పేర్కొన్నారు. జగన్ ఏపీలో ప్రతిపక్ష నేతని, అంటరానివాడు కాదన్నారు. జగన్‌తో కేటీఆర్ భేటీ అయితే టీడీపీ ఎందుకు ఉలికి పడుతోందో తమకు అర్థం కావడం లేదని సీతారాం నాయక్ విమర్శించారు.