Chandrababu: రాష్ట్ర పర్యటనకు వచ్చే టీఆర్ఎస్ నాయకులను కలిస్తే కఠిన చర్యలు: పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్
- పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ పాటించాలి
- బంధుత్వాలు, స్నేహం పేరుతో పార్టీ ప్రయోజనాలు పణంగా పెడితే ఊరుకోను
- దైవదర్శనానికి వచ్చి రాజకీయాలా అని తలసానిపై ఆగ్రహం
రాష్ట్ర పర్యటనకు వచ్చే టీఆర్ఎస్ నాయకులను టీడీపీ నాయకులెవరైనా కలిస్తే కఠినంగా వ్యవహరిస్తానని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఎలక్షన్ మిషన్ 2019పై గురువారం ఆయన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంధుత్వాలు, స్నేహం పేరుతో పార్టీ ప్రయోజనాలను పణంగా పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాద్ ఇటీవల ఏపీలో పర్యటించిన సందర్భంగా నెలకొన్న పరిణామాల నేపధ్యంలో సీఎం ఈ హెచ్చరికలు జారీ చేశారు.
అదే సమయంలో మంత్రి తలసాని తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కు తీర్చుకునేందుకు దేవాలయానికి వచ్చి ఎవరైనా రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి 26 కులాలను తొలగించి అక్కడి వారికి అన్యాయం చేశారని, కానీ ఏపీకి వచ్చి బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.