Hyderabad: హైదరాబాద్‌ హెచ్‌సీయూలో పులి సంచారం.. సిబ్బంది, విద్యార్థుల్లో కలకలం

  • ఉద్యోగులతోపాటు విద్యార్థుల్లో ఆందోళన
  • గుర్తు తెలియని జంతువును చూసినట్లు ఒక వ్యక్తి సమాచారం
  • దీంతో మొదలైన అలజడి

హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయం (హెచ్‌సీయూ) ఆవరణలో పులి సంచరిస్తోందన్న ప్రచారం ప్రస్తుతం ఆవరణలో నివాసం ఉంటున్న ఉద్యోగులు, విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వేలాది ఎకరాల్లో విశ్వవిద్యాలయం విస్తరించి ఉంది. ఆవరణలో ఇటీవల పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు పులిలాంటి గుర్తు తెలియని జంతువును చూశానని తోటి సిబ్బందితో చెప్పారు.

ఇది అలా అలా వర్సిటీ అంతటికీ పాకడంతో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. స్థానికంగా భయాందోళనలు నెలకొనడంతో వర్సిటీ సిబ్బంది విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వర్సిటీలో ఉంటున్న జంతు సంరక్షణ సంఘాల ప్రతినిధుల సాయంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి గుర్తులు ఉన్నాయని అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని వర్సిటీ ప్రాంగణం ఉంది. ఆవరణలో పలు చెరువులు కూడా ఉన్నాయి. చెరువుల అభివృద్ధి చేస్తున్న సమయంలోనూ పులిలాంటి జంతువులు ఎప్పుడూ కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు.

కానీ ఇటీవల కాలంలో చీకటి పడితే జింకలు, అడవి పందులు, నెమళ్లు వంటి జంతువులు అటవీ ప్రాంతం నుంచి వర్సిటీ ప్రాంగణంలోకి వస్తున్నాయని వర్సిటీ నివాసితులు చెబుతున్నారు. పులిలాంటి జంతువును ఎప్పుడూ చూడలేదని చాలామంది చెబుతున్నా, పులి భయం మాత్రం నివాసితులను వదిలిపోవడం లేదు. అటవీ శాఖ అధికారులు కొన్ని కాలిముద్రలు సేకరించి లాబొరేటరీకి పంపారు. ఆ వివరాలు వస్తే ఏ జంతువు సంచరిస్తోందన్న విషయం బయటపడుతుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News