YSRCP: జగన్పై సానుభూతి కోసమే దాడి చేశానన్న శ్రీనివాసరావు.. నేడు విజయవాడ కోర్టుకు హాజరు!
- అధికారుల ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం
- దాడి వెనక కుట్ర లేదని స్పష్టీకరణ
- శ్రీనివాసరావు లేఖను పరిశీలించిన ఎన్ఐఏ
జగన్ పై దాడి నిందితుడు శ్రీనివాసరావును నేడు విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. జగన్పై దాడి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గత శనివారం అతడిని అధీనంలోకి తీసుకుంది. ఆదివారం అతడిని హైదరాబాద్ కు తీసుకుని వచ్చి, పలు దఫాలుగా ప్రశ్నించింది. ఎన్ఐఏ ప్రశ్నలకు నిందితుడు ఒకే ఒక్క సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. జగన్పై సానుభూతి కోసమే దాడి చేశానని, ఇందులో ఎటువంటి కుట్ర లేదని పదేపదే చెప్పినట్టు తెలుస్తోంది.
నిందితుడుని అదుపులోకి తీసుకున్న తర్వాత అతడిని పలు కోణాల్లో అధికారులు విచారించారు. విద్యాభ్యాసం, తల్లిదండ్రులు, విమానాశ్రయ కేంటీన్లో ఉద్యోగం, స్నేహితులు, దాడికి ఉపయోగించిన కత్తి.. తదితర వాటిపై ప్రశ్నలు సంధించారు. అధికారులు ఎన్నిమార్లు ప్రశ్నించినా అతడు మాత్రం మౌనంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, జైలులో శ్రీనివాసరావు రాసిన 25 పేజీల లేఖను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలించారు.