Indian Railways: రైల్లో యువతికి నెలసరి ఇబ్బంది... కేంద్ర మంత్రికి ట్వీట్... ఉదారత చాటిన రైల్వే శాఖ!
- సమస్య తెలియగానే స్పందిస్తున్న రైల్వే శాఖ
- బెంగళూరు నుంచి బళ్లారికి వెళుతున్న యువతికి సమస్య
- నిమిషాల వ్యవధిలో శానిటరీ ప్యాడ్లు అందించిన అధికారులు
అందివచ్చిన ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ, రైలు ప్రయాణికుల సమస్యలను తక్షణం పరిష్కరిస్తూ, మన్ననలు అందుకుంటున్న భారతీయ రైల్వే, మరోసారి తన ఉదారతను చాటుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న వేళ, నెలసరి సమస్యతో బాధపడుతున్న యువతికి టాబ్లెట్లు, శానిటరీ ప్యాడ్లు అందించింది.
బెంగళూరు నుంచి బళ్లారికి వెళుతున్న ఓ యువతికి, రైల్లో నెలసరి సమస్య ఏర్పడగా, ఆమె మిత్రుడు రాత్రి 11 గంటల సమయంలో 'ఇండియన్ రైల్వేస్ సేవ' యాప్ ద్వారా రైల్వే మంత్రికి ట్వీట్ చేశాడు. ఆపై ఆరు నిమిషాల్లోనే అధికారులు, ఆమె ప్రయాణిస్తున్న బోగీ వద్దకు వచ్చారు. వివరాలు ధ్రువీకరించుకుని, తదుపరి వచ్చే అరసికేరు రైల్వే స్టేషన్ అధికారులకు విషయం చెప్పారు. ఆ వెంటనే వారు ఆమెకు కావాల్సిన శానిటరీ నాప్కిన్స్, టాబ్లెట్లను సిద్ధం చేసి, రైలు రాగానే అందించారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు అధికారులను అభినందించారు.