Roja: నాడు కేసీఆర్ కు శాలువా కప్పి పళ్లు ఇకిలించలేదా?: ఫొటోలు చూపిస్తూ దేవినేని ఉమకు రోజా కౌంటర్!
- గతంలో కేసీఆర్ విజయవాడకు వచ్చిన వేళ స్వాగతం పలికిన దేవినేని
- ఆ ఫోటోలు చూపిస్తూ విమర్శలు చేసిన రోజా
- అభివృద్ధి కోసం జగన్, కేటీఆర్ కలిస్తే తప్పేంటని ప్రశ్న
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య జరిగిన చర్చలపై దేవినేని ఉమ ఘాటు వ్యాఖ్యలు చేసిన వేళ, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. "ఈ రోజు చంద్రబాబునాయుడిలాగా చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసులు మాఫీ చేయించుకోలేదు. ఓటుకు నోటు కేసు కోసం ఈ నాలుగున్నర సంవత్సరాలూ కేసీఆర్ కాళ్లు పట్టుకుని, విజయవాడకు పారిపోలేదు. ఈ రోజు కేటీఆర్ వస్తాను అంటే, ఓ పార్టీ అధ్యక్షుడిగా ఆహ్వానించారు. అతను చెప్పిన విషయాలు విన్నారు. డిస్కస్ చేశారు. డిస్కస్ చేయడం కూడా తప్పంటే ఎట్లా?
ఆ మాట్లాడే ఉమ... ఇదే కేసీఆర్, విజయవాడకు వస్తే శాలువా కప్పి, పళ్లు ఇకిలించుకుంటూ, దుర్గమ్మ దర్శనం చేయించాడు. మరి ఇదే ఉమను కేసీఆర్ ఏమన్నారు? ఉమనా? ఆడా?... మగా?... మరి అలాంటి వ్యక్తిని నువ్వు దగ్గరుండి ఎలా దర్శనం చేయించావు? ఎలా నువ్వు చుట్టూ తిరిగావు? నీకేం సంబంధం? అంటే... మీ అవసరాల కోసం, మీ రాజకీయ లబ్దికోసం మీరు పిచ్చి వేషాలు వేస్తారు.
కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం జగన్ గారు ఎవరితోనైనా మాట్లాడినా తప్పేనంటారు. మరి దేవినేని ఉమ ఈ విధంగా కేసీఆర్ ను కలిశారు" అంటూ కొన్ని పాత ఫోటోలను రోజా చూపారు. ఆపై మాట్లాడుతూ, తన ప్రయోజనాల కోసం బాలకృష్ణ కూడా కేసీఆర్ చుట్టూ తిరిగారని విమర్శించారు. అందరికీ నీతులు చెప్పే పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్ ను కలిశారని అన్నారు.