BSF: సైనికులకు పెట్టే ఆహారంపై సంచలన విమర్శలు చేసిన జవాన్ కుమారుడి అనుమానాస్పద మృతి!
- ఆహారం నాసిరకమంటూ వీడియోలు పెట్టిన తేజ్ బహదూర్ యాదవ్
- విధుల నుంచి తొలగించిన అధికారులు
- ఇంట్లో విగతజీవిగా కనిపించిన తేజ్ కుమారుడు రోహిత్
భారత సైనికులకు పెడుతున్న ఆహారం అత్యంత నాసిరకమని, దాన్ని తినలేక ఇబ్బందులు పడుతూ, అస్వస్థతకు గురవుతున్నామని సంచలన విమర్శలు చేస్తూ వీడియోలు పెట్టిన బీఎస్ఎఫ్ జవాను కుమారుడు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. ఆరోపణల వీడియోలను పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ ను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంచితే, ఆయన కుమారుడు రోహిత్ (22) వారింట్లోనే తలుపులు మూసివున్న గదిలో రక్తపు మడుగులో కనిపించాడు. అతని చేతుల్లో ఓ గన్ కూడా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. "రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని మాకు ఫిర్యాదు అందింది. ఘటనా స్థలానికి వెళ్లాము. అతని గది లోపలి నుంచి గడియ పెట్టబడివుంది. మంచంపై అతని మృతదేహం, చేతుల్లో ఓ ఫిస్టల్ కనిపించాయి" అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
అతను సూసైడ్ చేసుకుని ఉండవచ్చని అనుకుంటున్నామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని అన్నారు. ఘటన జరిగిన సమయంలో తేజ్ బహదూర్ యాదవ్ ఇంట్లో లేడని, కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ కు వెళ్లాడని, అతనికి విషయం తెలిపామని అన్నారు.