Donald Trump: డబ్బులు లేవట... స్పీకర్ విదేశీ టూర్ ను క్యాన్సిల్ చేసిన డొనాల్డ్ ట్రంప్!
- మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలంటున్న ట్రంప్
- నిధుల మంజూరుకు హౌస్ నిరాకరణతో షట్ డౌన్
- బ్రసెల్స్, ఆఫ్గన్ పర్యటనను రద్దు చేస్తూ ఉత్తర్వులు
అమెరికాలో షట్ డౌన్ ప్రభావం మరింత పెర్గింది. మెక్సికో సరిహద్దుల్లో గోడను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాల్సిందేనంటూ ట్రంప్, కూడదని హౌస్ సభ్యులు భీష్మించుకుని కూర్చోవడంతో మొదలైన ఆర్థిక సంక్షోభం ఇప్పుడు తారస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం వైట్ హౌస్ లో కిచన్ మూసివేత, ఆపై ట్రంప్ పిజ్జాలు, బర్గర్లను బయటి నుంచి ఆర్డర్ చేసి రప్పించారన్న వార్తపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఇక తాజాగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, అఫ్గనిస్థాన్ లో తలపెట్టిన పర్యటనను రద్దు చేస్తున్నట్టు ట్రంప్ ఉత్తర్వులు వెలువరించారు. గురువారం నాడు ఆమె ప్రయాణాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. బ్రసెల్స్ లోని మిలటరీ నేతలను, ఆఫ్గన్ లోని అమెరికా దళాలను కలిసిరావాలని కొందరు టాప్ డెమోక్రాట్లు, నాన్సీ పెలోసి ప్రణాళిక రూపొందించారు.
ఇక తన ప్రయాణ రద్దు ఉత్తర్వుల్లో "మీరు ఈ సమయంలో వాషింగ్టన్ లోనే ఉండి, నాతో, సహచర సభ్యులతో చర్చించాలని నేను కోరుకుంటున్నాను. ఈ షట్ డౌన్ ను ఇంతటితో ముగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ప్రయాణానికి అవసరమైన నిధులను కల్పించే పరిస్థితి లేదు. షట్ డౌన్ ముగిసిన తరువాత మీ ప్రయాణాన్ని పెట్టుకోవచ్చు" అని అన్నారు.