Andhra Pradesh: ఏపీ పోలీసులు రిసార్ట్ లో బంధించి 2 రోజులు టార్చర్ పెట్టారు.. తట్టుకోలేక ఒప్పుకున్నా!: సీబీఐకి సత్యంబాబు వాంగ్మూలం
- సత్యంబాబును విచారిస్తున్న సీబీఐ టీమ్
- సెల్ ఫోన్లపై మోజు ఉండటంతో దొంగలించా
- నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారు
బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఇటీవల హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సత్యంబాబు సీబీఐ అధికారులకు తెలిపాడు. విచారణ పేరుతో పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారనీ, ఆ టార్చర్ తట్టుకోలేక నేరం చేసినట్లు ఒప్పుకున్నానని అన్నాడు. ప్రస్తుతం తనకు బతకడానికి పని కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సెల్ ఫోన్లపైన మోజు ఉండేదనీ, అందువల్ల తాను ఫోన్లను దొంగిలించేవాడినని పేర్కొన్నాడు. అయితే తనను పోలీసులు అయేషా మీరా హత్య కేసులో ఇరికించారని చెప్పాడు.
కృష్ణా జిల్లాలోని అనాసాగరంలో ఉన్న సత్యంబాబు ఇంటికి ఈరోజు ఉదయం నలుగురు సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. తొలుత సత్యంబాబు ఇంటిలో తనిఖీలు చేపట్టిన అధికారులు అతడిని ఓ గదిలో బంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సత్యం బాబు మాట్లాడుతూ..ఆయేషా మీరా హత్య తర్వాత ఏపీ పోలీసులు తనను ఉమా హలీడే రిసార్ట్ లో రెండ్రోజులు బంధించి టార్చర్ పెట్టారని తెలిపాడు.
తన గొంతుకు (వాయిస్) దగ్గరగా ఉన్న మరో వ్యక్తితో నేరాన్ని అంగీకరించినట్లు చెప్పించి, వీడియో వాంగ్మూలాన్ని తయారుచేశారని సీబీఐ అధికారులకు తెలిపాడు. జైలులో తల్లి, చెల్లి తప్ప తనను ఎవరూ కలవలేదనీ, ఏడేళ్లు ఏసు ప్రభువును ప్రార్ధిస్తూ గడిపానని పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న సీబీఐ విచారణ మరికాసేపట్లో ముగిసే అవకాశముంది. 2007, డిసెంబర్ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ లో ఆయేషా మీరా(19)పై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి కిరాతకంగా చంపారు.