USA: ఉద్యోగికి సెలవు ఇవ్వకుండా పనిచేయించిన హోటల్.. రూ.152 కోట్లు జరిమానా విధించిన కోర్టు!
- అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
- ఆదివారం సెలవు ఇవ్వని కిచెన్ మేనేజర్
- న్యాయపోరాటంలో బాధితురాలి విజయం
ఓ మహిళా ఉద్యోగికి ఆదివారం సెలవు ఇవ్వకుండా దాదాపు 10 సంవత్సరాలు పనిచేయించుకున్న ఓ హోటల్ పై న్యాయస్థానం కొరడా ఝుళిపించింది. రూపాయి కాదు.. రెండు రూపాయలు కాదు.. ఏకంగా రూ.152 కోట్లను ఆ మహిళకు చెల్లించాలని సదరు హోటల్ ను ఆదేశించింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకుంది.
హైతీ దేశానికి చెందిన మేరీ అనే మహిళ ఫ్లోరిడాలోని మియామీకి వలస వచ్చారు. అక్కడే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పనికి కుదిరారు. తొలుత ఆమెకు అక్కడి యాజమాన్యం ఆదివారం సెలవును కేటాయించింది. వారంలో ఆరు రోజులు హోటల్ లో పనిచేసే మేరీ, ఆదివారం మాత్రం చర్చిలో పనిచేసేవారు. అయితే ఆ తర్వాత కిచెన్ మేనేజర్ గా వచ్చిన వ్యక్తి.. ఆదివారం కూడా పనికి రావాలని మేరీని ఆదేశించారు. ఆదివారం పనిచేయడం తమ మతాన్ని అగౌరవించినట్లు అవుతుందని మేరి చర్చి ఫాదర్ చేత లేఖ రాయించారు.
అయినా ఒప్పుకోకపోవడంతో దాదాపు పదేళ్ల పాటు మేరి సెలవు లేకుండా పనిచేశారు. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆమె తోటి సిబ్బంది సాయంతో ఆదివారం సెలవు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మేనేజర్ మేరీని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బాధితురాలు ఈఈఓసీ (సమాన ఉద్యోగ అవకాశ కమిషన్)ను ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన ఫ్లోరిడా ఫెడరల్ కోర్టు మేరీ మనోభావాలను దెబ్బతీయడంతో పాటు అదనంగా పనిచేయించినందుకు 21.5 మిలియన్ డాలర్లు(రూ.152.95 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో పూర్తిస్థాయిలో వాస్తవాలను పరిశీలించకుండానే కోర్టు తీర్పు ఇచ్చిందని హోటల్ యాజమాన్యం వాపోయింది.