talasani srinivas: తలసాని తన ఆస్తులను బీసీలకు పంచిపెట్టాలి: బుద్ధా వెంకన్న
- బీసీల పేరిట తలసాని వేల కోట్లు సంపాదించారు
- టీడీపీలో బీసీలకు నాయకత్వం లేదనడం తగదు
- నేను బీసీనే..ఎమ్మెల్సీతో పాటు ప్రభుత్వ విప్ ని కూడా
బీసీలను అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్న టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, తన ఆస్తులను బీసీలకు పంచిపెట్టాలని ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలో బీసీలకు నాయకత్వం లేదంటూ తలసాని చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. తాను బీసీనేనని, ఎమ్మెల్సీతో పాటు ప్రభుత్వ విప్ పదవి కూడా తనకు ఉందని గుర్తుచేశారు.
‘బీసీలను పెంచిందే టీడీపీ. యనమల రామకృష్ణుడు ఎవరు? టీటీడీ చైర్మన్ ఎవరు? అచ్చెన్నాయుడు ఎవరు? బీసీలు.. టీడీపీలో బీసీలు ఇంతమంది ఉన్నారు. అక్కడ కేసీఆర్ ఏమో బీసీలను అణగదొక్కుతున్నారు. మీకు ఏదో మంత్రి పదవి ఇచ్చారని, బీసీలకు ఏదో బాగా చేస్తున్నారంటున్నారు. బీసీలపై చర్చ పెడదాం.. రండి. మీ రాష్ట్రంలో బీసీ నాయకులు ఎక్కువ మంది ఉన్నారా? ఈ రాష్ట్రంలో బీసీ నాయకులు ఎక్కువ మంది ఉన్నారా? మీ ఎమ్మెల్సీల్లో బీసీలు ఎక్కువా? ఇక్కడి ఎమ్మెల్సీల్లో బీసీలు ఎక్కువ? చర్చ పెడదాం రండి. అన్నం పెట్టిన చేతినే నరకాలని మీరు చూస్తున్నారు. అది చాలా తప్పు. ఇకనైనా, మీరు మారాలని కోరుకుంటున్నా’ అని బుద్ధా వెంకన్న తలసానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.