YSRCP: షర్మిలపై దుష్ప్రచారం కేసులో ఐదుగురి అరెస్ట్.. విచారణ వేగవంతం
- మొత్తం 15 మందిని గుర్తించిన పోలీసులు
- ఐదుగురికి నోటీసులు
- యూట్యూబ్‌కు లేఖ
వైఎస్ జగన్ సోదరి షర్మిల కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం నిందితులుగా పరిగణించి నోటీసులు జారీ చేశారు. వీరంతా హైదరాబాదులో ఉంటున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు. షర్మిలపై అసభ్యకర రాతలు రాసిన వారిలో శుక్రవారం నాటికి పోలీసులు మొత్తం 15 మందిని గుర్తించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురూ సొంత యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే మొత్తం 60 వీడియో లింకుల్ని గుర్తించిన పోలీసులు అవి ఏయే యూట్యూబ్ చాన్సల్స్‌కు సంబంధించినవో గుర్తించే పనిలో ఉన్నారు. కాగా, వీడియో పోస్టు చేసిన వారితో పాటు దానికి కామెంట్ చేసినవారు కూడా నిందితులే అవుతారని పోలీసులు తెలిపారు.
యూట్యూబ్ చానల్‌లో వారు క్రియేట్ చేసుకున్న పేరు తప్ప ఇతర వివరాలేవీ ఉండవు. కాబట్టి ఆ వివరాలు కావాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులు యూట్యూబ్‌కు లేఖ రాశారు. వారి లాగిన్, ఐపీ వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. వారి నుంచి పూర్తి వివరాలు అందిన వెంటనే మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది.