Mamata Banerjee: కోల్‌కతా ర్యాలీకి చంద్రబాబు వెళుతున్నందుకే.. మేం దూరంగా ఉంటున్నాం: టీఆర్ఎస్
- మమత ఆహ్వానించారు
- చంద్రబాబుతో వేదిక పంచుకోబోం
- అందుకే వెళ్లడం లేదు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు కోల్‌కతాలో నిర్వహించనున్న మహా ర్యాలీకి తాము హాజరు కాబోవడం లేదని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మమతా బెనర్జీ నుంచి తమకు ఆహ్వానం అందిందని అయితే, ఆ ర్యాలీకి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానుండడంతో తాము దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. చంద్రబాబుతో టీఆర్ఎస్ వేదిక పంచుకోదని స్పష్టం చేశారు.
భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ర్యాలీగా అభివర్ణిస్తున్న ఈ ర్యాలీకి ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆర్ఎల్‌డీ చీఫ్ అజిత్ సింగ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు.
అయితే, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకావడం లేదు. వారి తరుపున సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, అభిషేక్ మను సింఘ్వీ హాజరుకానున్నారు. అలాగే, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ ర్యాలీకి దూరంగా ఉంటున్నారు. ఆమె తరపున ఎంపీ సతీశ్ మిశ్రా ర్యాలీలో పాల్గొననున్నారు.