Telangana: మృదువుగానైనా, కఠినంగానైనా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతా!: సీఎల్పీ నేత భట్టి
- ఎమ్మెల్యేలను కలుపుకునిపోతా
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిబద్ధత కలిగిన సైనికులు
- ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఆశీస్సులు, తెలంగాణ నేతల మద్దతుతోనే తాను రాష్ట్ర సీఎల్పీ నేతగా ఎన్నిక అయ్యాయని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకుని పోతానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాడుతానని స్పష్టం చేశారు. సీఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిబద్ధత కలిగిన సైనికులని భట్టి విక్రమార్క అన్నారు. మృదువుగానైనా, కఠినంగానైనా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతానని స్పష్టం చేశారు. ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని అధికార టీఆర్ఎస్ యత్నించడం దుర్మార్గమని విమర్శించారు.