Madras high court: చూడాల్సింది ఆమెలోని ధైర్యాన్ని.. సమయాన్ని కాదు: గర్భిణికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాల్సిందేనన్న హైకోర్టు
- వంద మీటర్ల పరుగులో 30 సెకన్లు ఎక్కువ తీసుకున్న వివాహిత
- ఉద్యోగం నిరాకరించిన అధికారులు
- గర్భిణి కావడంతో సమయాన్ని ప్రామాణికంగా తీసుకోరాదన్న కోర్టు
గ్రేడ్-2 కానిస్టేబుల్ నియామకాల కోసం నిర్వహించిన పరుగులో నిర్దేశిత సమయం కంటే 30 సెకన్లు అదనంగా తీసుకున్నందుకు ఓ గర్భిణికి ఉద్యోగం నిరాకరించారు. దీంతో ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. ఆమె గర్భిణి అని, కాబట్టి సమయాన్ని లెక్కలోకి తీసుకోకుండా, ఆమెలోని ధైర్యాన్ని మాత్రమే చూడాలని తీర్పులో పేర్కొంది.
మదురైకి చెందిన ఆర్. దేవిక అనే వివాహిత కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన 100 మీటర్ల పరుగును 17:50 సెకన్లలో పూర్తిచేయాల్సి ఉండగా, ఆమె 30 సెకన్లు అదనంగా తీసుకున్నారు. దీంతో ఫిజికల్ ఫిట్నెస్లో ఫెయిల్ అయినట్టు అధికారులు ప్రకటించారు.
తనను ఫెయిల్ అయినట్టు ప్రకటించడంతో దేవిక మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్.విమల.. ఆమె గర్భవతి అని, గర్భవిచ్ఛిత్తి జరిగే ప్రమాదముందని తెలిసినా ఆమె పరుగులో పాల్గొన్నారని పేర్కొంది. ఇక్కడ చూడాల్సింది ఆమెలోని ధైర్యాన్ని తప్పితే సమయాన్ని కాదని తేల్చి చెప్పారు. ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. గ్రేడ్-2 కానిస్టేబుల్ పోస్టు కానీ, లేదంటే గ్రేడ్-2 జైలు వార్డెన్ పోస్టు కానీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, అక్టోబరు 31, 2018 నుంచి అటెండెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని పేర్కొన్నారు.