Kerala: కేరళ ప్రభుత్వానికి కమల్ మద్దతు.. ఆయన పార్టీ హిందువుల ద్రోహి అన్న బీజేపీ!
- కమల్ పై బీజేపీ నేత రాజా తీవ్ర వ్యాఖ్యలు
- ప్రవం చర్చ్ వ్యవహారంలో మాట్లాడటం లేదని విమర్శ
- ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి
ప్రముఖ నటుుడు కమలహాసన్ పై బీజేపీ నేత రాజా విరుచుకుపడ్డారు. కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం హిందువుల ద్రోహి పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయసులో ఉన్న మహిళలు (10-50 ఏళ్లలోపు మహిళలు) వెళ్లవచ్చని, అయ్యప్పస్వామిని దర్శించుకోవచ్చని గతేడాది సెప్టెంబర్ 28న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళలను ఆందోళనకారులు, హిందుత్వ సంఘాల సభ్యులు అడ్డుకున్నారు. తాజాగా ఈ విషయమై కమలహాసన్ స్పందిస్తూ.. శబరిమల వ్యవహారంలో కేరళ ప్రభుత్వాన్ని తప్పుపట్టకూడదని అన్నారు.
దీనిపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శబరిమల వ్యవహారంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదట. సుప్రీంకోర్టు తీర్పును అమలు పరచాలని కమలహాసన్ అంటున్నారు. అలాగైతే 2017లో ప్రవం చర్చ్ వ్యవహారంలో న్యాయస్థానం తీర్పును పినరయి విజయన్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? ఈ విషయం గురించి ప్రశ్నించే ధైర్యం కమలహాసన్‌కు ఉందా? మొత్తం మీద మక్కల్ నీది మయ్యం హిందువుల ద్రోహి పార్టీనే’ అని ట్విట్టర్ లో దుయ్యబట్టారు.