kcr: 24 వేల కోట్లు ఇమ్మని చెబితే.. 24 రూపాయలు కూడా ఇవ్వలేదు: కేసీఆర్

  • కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమాత్రం సహకరించడం లేదు
  • పన్నుల వాటాను తప్ప.. అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు
  • రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.2.40 లక్షల కోట్లు

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఆయన మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా... కేంద్రం కనీసం రూ. 24 రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు. రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన పన్నుల వాటాను తప్ప అదనంగా ఒక్క రూపాయిని కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు రూ. 2.40 లక్షలు కోట్లని... ఈ అప్పును చెల్లిస్తే మళ్లీ రూ. 1.30 లక్షల కోట్లను అప్పుగా తెచ్చుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై రూ. 1.20 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్లను నిర్మించామని చెప్పారు. మార్చి నాటికి మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీటిని అందిస్తామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన పింఛన్లు, రైతు బంధు, నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని చెప్పారు. ప్రజా సంక్షేమం, వ్యవసాయం, ప్రాజెక్టుల తర్వాత రహదారులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News