Sachin: మరోసారి వార్తల్లో నిలిచిన ‘జొమాటో’.. వినియోగదారుడికి క్షమాపణలు!
- జొమాటోలో పన్నీర్ చిల్లీ ఆర్డర్
- ఆహారంలో ఫైబర్‌ను గుర్తించిన కస్టమర్
- పోలీసులకు ఫిర్యాదు
ఈ మధ్య కాలంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తరచుగా వివాదాలపాలవుతోంది. ఇటీవల ఓ జొమాటో డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్‌ని కొద్దిగా కొద్దిగా తిని.. తిరిగి ప్యాక్ చేసి డెలివరీ చేసిన ఘటన మరువక ముందే.. మరోసారి వార్తల్లో నిలిచింది.
పన్నీర్ చిల్లీలో ప్లాస్టిక్ ఫైబర్‌ను గుర్తించిన ఓ వినియోగదారుడికి జొమాటో క్షమాపణలు తెలిపింది. అసలు విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన సచిన్ జామ్‌దారే.. జొమాటోలో పన్నీర్ చిల్లీ, పన్నీర్ మసాలాను ఆర్డర్ చేశాడు. దానిని కుటుంబ సభ్యులతో కలిసి తింటుండగా.. సచిన్ కుమార్తె తన పళ్లకు చూయింగ్ గమ్‌లా ఏదో అంటుకోవడాన్ని గుర్తించింది. వెంటనే తండ్రికి విషయం చెప్పగా అతను దానిలో ఫైబర్ ఉన్నట్టు సచిన్ గుర్తించాడు.
సదరు రెస్టారెంట్‌కు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యపు సమాధానమే ఎదురవడంతో అతను.. పోలీసులను ఆశ్రయించాడు. ఆహారాన్ని కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న ఇలాంటి రెస్టారెంట్లపై చర్య తీసుకోవాలని సచిన్ ఫిర్యాదు చేశాడు. అయితే సచిన్ తెచ్చిన ఆహారాన్ని పరీక్షలకు పంపామని.. నివేదిక రాగానే చర్య తీసుకుంటామని ఇన్స్పెక్టర్ శ్యాం సుందర్ వాసుల్కర్ తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన జొమాటో సంస్థ సచిన్‌కు క్షమాపణలు తెలిపింది. ఆ రెస్టారెంట్‌ను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించినట్టు స్పష్టం చేసింది.