Hyderabad: వ్యూస్ పెంచుకునేందుకే షర్మిల, ప్రభాస్ లపై తప్పుడు ప్రచారం.. పోలీసుల అనుమానం!
- గతవారంలో హైదరాబాద్ లో షర్మిల ఫిర్యాదు
- పలు యూ ట్యూబ్ చానళ్ల యజమానుల విచారణ
- కథనాలన్నీ ఊహాజనితమేనంటున్న పోలీసులు
కొన్ని యూ ట్యూబ్ చానళ్లు, తమకు వచ్చే వ్యూస్ ను పెంచుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల, సినీ నటుడు ప్రభాస్ మధ్య సంబంధముందన్న ఊహాజనిత వీడియోలను ప్రసారం చేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గత వారంలో షర్మిల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసును తీవ్రంగా తీసుకుని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే పలు చానళ్ల యజమానులను పిలిచి విచారించారు.
నిన్న ఆదివారం నాడు మరో 5 యూ ట్యూబ్ చానల్స్ ప్రతినిధులను విచారించారు. ఈ చానళ్లన్నీ ఏదో ఒక సమయంలో షర్మిల, ప్రభాస్ లపై కథనాలు ఇచ్చాయని గుర్తించిన పోలీసులు, కేవలం తమకు వచ్చే వ్యూస్ ను పెంచుకుని డబ్బు సంపాదించుకునేందుకే ఈ పని చేశారని అధికారులు భావిస్తున్నారు. చానల్స్ ప్రతినిధులను మరోసారి విచారిస్తామని, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని నోటీసులు ఇచ్చి వారిని పంపించి వేశామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు.