Michael Clarke: డబ్బు సంపాదిస్తున్నానని గర్వం వద్దు.. గౌరవమే ముఖ్యం: రాహుల్-పాండ్యా వివాదంపై ఆసీస్ మాజీ కెప్టెన్
- గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోవాలి
- డబ్బు కంటే అది ఎంతో ముఖ్యం
- తప్పులు అందరూ చేస్తారు
ఓ టీవీ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వ్యవహారంపై ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పందించాడు. డబ్బు సంపాదన కాదని, ప్రతి ఒక్కరినీ గౌరవించడాన్ని తొలుత నేర్చుకోవాలని సూచించాడు. ఇక్కడ నువ్వెంత సంపాదిస్తున్నావన్నది అప్రస్తుతమని పేర్కొన్న క్లార్క్ గౌరవం సంపాదించుకోవడం, దానిని ఇవ్వడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని, ఇందుకు ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నాడు. అయితే, ఒకసారి చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని అన్నాడు.
పాండ్యా లాంటి నైపుణ్యం కలిగిన ఆటగాడు చాలా నిబద్ధతగా ఉండాలన్నాడు. అతడు తన ఆటతీరుతో మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉందని పేర్కొన్నాడు. రాబోయే ప్రపంచకప్‌లో అతడికి చోటు దక్కుతుందని క్లార్క్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రొఫెషనల్ ఆటగాళ్లు యువతకు రోల్ మోడల్స్‌గా మారతారని, కాబట్టి మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని క్లార్క్ హితవు పలికాడు.