Andhra Pradesh: షర్మిల గొడవను టీడీపీపై రుద్దేందుకు ప్రయత్నించారు..కుట్రకు తెరలేపారు!: సీఎం చంద్రబాబు
- పోలవరం కోసం మరోసారి లేఖ రాశాను
- డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇస్తాం
- అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ
త్వరలో నిర్వహించనున్న జయహో బీసీ, అమరావతిలో ధర్మపోరాట సభలను విజయవంతం చేయాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని చంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి 8 వరకూ సమావేశాలు కొనసాగవచ్చన్నారు. ఏపీలో ప్రస్తుతం 95 లక్షల మంది డ్వాక్రా మహిళలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం విషయంపై చంద్రబాబు స్పందించారు. షర్మిల వివాదాన్ని టీడీపీపై రుద్దేందుకు కొందరు ప్రయత్నించారని ఆరోపించారు. పెన్షన్లను రెట్టింపు చేయడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రకు తెరలేపారని విమర్శించారు. రైతులకు రుణమాఫీకి సంబంధించి మిగిలిన రెండు విడతల సొమ్మును ఇచ్చేస్తున్నామని ప్రకటించారు.
ఎన్ని ఇబ్బందులున్నా డ్వాక్రా మహిళలకు రూ.10,000 ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పోలవరం డ్యామ్ కు నిధుల కేటాయింపులో ఆలస్యంపై ఈరోజు మరోసారి కేంద్రానికి లేఖ రాశానని చంద్రబాబు అన్నారు. ఏపీలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.