Yadadri Bhuvanagiri District: తన ఓటు వేసుకోవడం మరచిన సర్పంచ్ అభ్యర్థి.. ఒక్క ఓటు తేడాతో ఓటమి!

  • యాదాద్రి జిల్లా రంగాపురంలో ఘటన
  • ప్రచారంలో మునిగి ఓటు వేయడం మరచిన అభ్యర్థి
  • ఒక్క ఓటు తేడాతో ఓడి చింతిస్తున్న వైనం

దురదృష్టం వెక్కిరిస్తే ఇలాగే ఉంటుంది మరి. తనకు ఓటు వేసి గెలిపించాలంటూ అందరినీ కోరిన ఆ అభ్యర్థి చివరికి తన ఓటునే వేసుకోవడం మర్చిపోయాడు. ఫలితం.. ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యాడు. తెలంగాణలో సోమవారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిందీ ఘటన. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశం కాగా, ఓడిపోయిన అభ్యర్థి చేసిన పొరపాటుకు చింతిస్తూ కూర్చున్నాడు.

మండలంలోని రంగాపురం గ్రామ సర్పంచ్ పదవికి మర్రి ఆగంరెడ్డి, రామిడి ప్రభాకర్ రెడ్డి పోటీపడ్డారు. సోమవారం ఎన్నికలు నిర్వహించగా మధ్యాహ్నం వరకు ఆగంరెడ్డి దంపతులు తమకే ఓటు వేయాలంటూ అందరినీ అభ్యర్థించారు. తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అయితే, ప్రచారంలో పడి తమ ఓట్లను వేసుకోవడం మర్చిపోయారా దంపతులు. సరిగ్గా అదే ఫలితాన్ని తారుమారు చేసింది. ప్రత్యర్థి ప్రభాకర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఆగంరెడ్డి దంపతులు తమ ఓట్లను వేసుకుని ఉంటే రెండు ఓట్లు పడేవి. ఫలితంగా ఒక్క ఓటు తేడాతో ఆయనే గెలిచి ఉండేవారు. ఓటు వేయడంలో నిర్లక్ష్యం అతడి జీవితాన్ని తారుమారు చేసింది. చేసేది లేక ఇప్పుడు తీరిగ్గా దుఃఖిస్తున్నారా దంపతులు.

  • Loading...

More Telugu News