devadas kanakala: తొలి సినిమాలో అక్కినేనికి స్నేహితుడిగా కనిపించాను: దేవదాస్ కనకాల
- చిన్నప్పటి నుంచి నాటకాలు ఇష్టం
- తొలి సినిమా 'బుద్ధిమంతుడు'
- రాజీవ్ కనకాల మంచి నటుడు
దేవదాస్ కనకాల ఎన్నో వైవిధ్య భరితమైన చిత్రాలలో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒక వైపున నట శిక్షణాలయం నిర్వహిస్తూనే .. మరో వైపున కొన్ని సినిమాలకి దర్శకత్వం కూడా వహించారు. చిత్రపరిశ్రమకి ఎంతో మంది నటీనటులను అందించిన ఆయన, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"చిన్నప్పటి నుంచి నాకు నాటకాలు వేయడమంటే ఇష్టం. అలా ఒక నాటకం వేసినప్పుడు అంతా వచ్చి అభినందించారు. అలాంటి గుర్తింపు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దాంతో సహజంగానే నా మనసు నటన వైపుకు మళ్లింది. తెలుగులో నేను బాపుగారి 'బుద్ధిమంతుడు' సినిమాలో మొదటిసారిగా నటించాను. ఆ సినిమాలో నేను అక్కినేని స్నేహితుల్లో ఒకడిగా కనిపిస్తాను. ఒకప్పుడు అంతా దేవదాస్ కనకాల కొడుకు రాజీవ్ కనకాల అనేవారు .. ఇప్పుడు అంతా రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అంటున్నారు. అందుకు నా కెంతో గర్వంగా వుంది" అని అన్నారు.