Wrong Call: పొరపాటున కాల్ చేసిన యువతిని వేధించుకుతిన్న బాలుడు... ఆటకట్టించిన రాచకొండ సైబర్ క్రైమ్!

  • బాలుడి ఫోన్ కు గత నెలలో కాల్ చేసిన యువతి
  • ఆపై అసభ్య చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులు
  • అరెస్ట్ చేసి రిమాండుకు పంపిన పోలీసులు
పట్టుమని పద్దెనిమిదేళ్లు నిండని కుర్రాడు. అతని ఫోన్ కి తెలియని నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరో చూద్దామని తిరిగి ఫోన్ చేస్తే, అవతలి నుంచి ఓ యువతి మాట్లాడింది. తాను పొరపాటున కాల్ చేశానని, ఏమీ అనుకోవద్దని చెప్పి పెట్టేసింది. అంతటితో ఆ బాలుడు విషయాన్ని వదిలేయలేదు. అందుకే ఇప్పుడు కటకటాలపాలయ్యాడు.

రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా వెలిగోడు మండలం మోత్కూరుకు చెందిన ఓ బాలుడి (17) ఫోన్ కి గత సంవత్సరం డిసెంబరులో మిస్డ్‌ కాల్‌ వచ్చింది. దీంతో అతను తిరిగి అదే నంబర్ కు ఫోన్ చేయగా, మాట్లాడిన యువతి, రాంగ్‌ డయల్‌ అయిందని చెప్పింది. ఆపై ఆ బాలుడి నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి.

పదేపదే ఫోన్ చేస్తుంటే, అతనితో మాట్లాడేందుకు ఆమె అంగీకరించలేదు. అయినా, పదేపదే ఫోన్ చేస్తుండగా, స్పందించడం మానేసింది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకున్న బాలుడు, వాట్స్ యాప్ ద్వారా అసభ్యకరమైన చిత్రాలను, తన కోరిక తీర్చాలంటూ మెసేజ్ లు పెడుతూ వేధించుకు తింటున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసును విచారించిన పోలీసులు, బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
Wrong Call
Harrasment
Hyderabad
Cyber Crime
Arrest

More Telugu News