Andhra Pradesh: బాలకృష్ణపై హిందూపురంలో మహిళా టీవీ యాంకర్ ను పోటీకి దించుతున్న కేఏ పాల్!
- ప్రజాశాంతి పార్టీలో కుల,మత భేదాలు లేవు
- హిందూపురం టికెట్ ను శ్వేతారెడ్డికి ఇస్తున్నాం
- మీడియాతో మాట్లాడిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
ప్రజాశాంతి పార్టీలో కులం, మతం, ప్రాంతాల ఆధారంగా విభేదాలు లేవని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, యాదవ్, రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు చెందినవారు ఉన్నారని పేర్కొన్నారు. అవినీతి రాజకీయ నేతలను నమ్మకుండా ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. తాను కులానికి, వరకట్నం పద్ధతికి వ్యతిరేకంగా పోరాడానని అన్నారు.
ఈ సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ నేత బాలకృష్ణకు పోటీగా అభ్యర్థిని నిలబెడుతున్నట్లు పాల్ ప్రకటించారు. ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డిని బాలయ్యపై పోటీకి దించుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే లక్ష్మీతులసి అనే కాపు సామాజికవర్గానికి చెందిన అమ్మాయికి అమలాపురం టికెట్ ఇస్తున్నట్లు చెప్పారు. తాను యువతను ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు.
150 కోట్ల ముస్లింల కోసం తాను అమెరికాతో పోరాడాననీ, వాళ్లందరిని కాపాడానని చెప్పుకొచ్చారు. ప్రజాశాంతి పార్టీ కోసం ఏపీలో 50,000 మంది కోఆర్డినేటర్లను నియమించుకున్నామని తెలిపారు. తన పార్టీలో అందరూ యువతేనని చెప్పారు. ఒక్కో కోఆర్డినేటర్ కనీసం వెయ్యి మందిని పార్టీలో చేర్పిస్తే ఇక ప్రజలు జగన్, పవన్ కల్యాణ్ చంద్రబాబుకు ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించారు. ఈ ముగ్గురు నేతలు తనలా సంవత్సరానికి రూ.లక్ష కోట్లు బయటి నుంచి తీసుకుని రాలేరనీ, నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఇవ్వలేరని స్పష్టం చేశారు. అదంతా తనకే సాధ్యమని కుండబద్దలు కొట్టారు.