modi: 43 ఏళ్లుగా మోదీని చూస్తున్నా.. ఏ రోజూ ఆయన టీ అమ్మలేదు: ప్రవీణ్ తొగాడియా
- సానుభూతి కోసం చాయ్ వాలా ఇమేజ్ ను వాడుకుంటున్నారు
- రామాలయం నిర్మాణం పూర్తైతే బీజేపీ, ఆరెస్సెస్ లకు పని ఉండదు
- మోదీ మరోసారి ప్రధాని అయినా రామాలయాన్ని నిర్మించరు
ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా విమర్శలు గుప్పించారు. మోదీతో తనకు 43 ఏళ్లుగా స్నేహం ఉందని... ఆయన ఎప్పుడూ టీ అమ్మడం తాను చూడలేదని అన్నారు. ప్రజల సానుభూతి కోసమే చాయ్ వాలా ఇమేజ్ ను మోదీ వాడుకుంటున్నారని విమర్శించారు. తొగాడియా ప్రస్తుతం అంతర్ రాష్ట్రీయ హిందూ పరిషత్ కు అంతర్జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్ లకు రామ మందిరం నిర్మించాలనే ఆలోచనే లేదని అన్నారు. వచ్చే ఐదేళ్లలో కూడా రామ మందిర నిర్మాణం జరగదని ఆరెస్సెస్ నేత భయ్యాజీ జోషీ కూడా చెప్పారని తెలిపారు. 125 కోట్ల మంది ప్రజలను బీజేపీ, ఆరెస్సెస్ లు భ్రమల్లో ఉంచాయని చెప్పారు. కానీ, ఇప్పుడు దేశంలోని హిందువులంతా మేల్కొన్నారని అన్నారు.
ఫిబ్రవరి 9న హిందువుల కోసం కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నామని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే... మరుసటి రోజే రామాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. మోదీ మరోసారి ప్రధాని అయినా... రామాలయాన్ని నిర్మించరని తెలిపారు. రామాలయం పూర్తైతే బీజేపీ, ఆరెస్సెస్ లకు పని ఉండదని... అందుకే, ఆలయ నిర్మాణం జరగకుండా ఆ సమస్యను సజీవంగా ఉంచుతున్నాయని విమర్శించారు.